Bhatti Vikramarka Comments: సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దేశ ప్రధాన మంత్రిగా కాకుండా భాజపా అధ్యక్షుడిగా మోదీ ప్రవర్తించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అక్కడ కార్యకలాపాలన్నీ కూడా పార్టీకి చెందినవిగా జరిగాయని ఆయన అన్నారు. రామానుజాచార్యులతత్వాన్ని చెప్పలేదని విమర్శించారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు కూడా నిర్వహించలేదని ధ్వజమెత్తారు. సమతామూర్తి రామానుజాచార్యులతత్వానికి పూర్తి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయని మండిపడ్డారు.
దేశ ప్రధానిగా వచ్చినప్పుడు... సమానత్వంతో కార్యకలాపాలు జరగాల్సి ఉండగా ఆయనకు స్వాగతం పలికే దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు భాజపా కార్యకలాపాల మాదిరిగా జరగడం దురదృష్టకరమన్నారు. మానవులంతా సమానమేనని తన మతాన్ని ప్రేమిస్తూనే... పర మతాలను కూడా గౌరవించాలని రామానుజాచార్యులు చెప్పారన్నారు. దేశ ప్రధాని మోదీ... రామానుజచార్యులతత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ భారత దేశ రాష్ట్రాలకు అన్యాయం చేయవద్దని... ఉత్తర భారత రాష్ట్రాలతో సమానంగా చూడాని... వనరులను, వాటాలను కేటాయించాలని మోదీని డిమాండ్ చేశారు.
విభజించు పాలించు అనే ఆలోచన మొత్తాన్ని నిన్న చూపించారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్న. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ... అందరినీ సమానంగా చూడమని చెబుతోంది. అలాంటి విగ్రహం దగ్గరనే మీరు అసమానతలను చూపించారు. అది ఒక భాజపా ప్రొగ్రామ్‌లా మార్చారు. ఈ దేశంలో మతాల్ని, కులాల్ని, అందరిన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందే సభలాగా మీరు నడిపితే ఎట్ల? నిన్న మీరు పిలిచింది భాజపా అధ్యక్షుడినా? లేక ఈ దేశ ప్రధానినా?
-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీచూడండి: Statue of Equality: సమున్నత మూర్తి.. మహోజ్వల దీప్తి