కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టుల మూసివేతను సెప్టెంబరు 5 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కోర్టులు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, ట్రైబ్యునళ్లు, జ్యుడిషియల్ అకాడమీల్లో సెప్టెంబరు 5 వరకు రెగ్యులర్ విధులను నిలిపివేస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో అత్యవసర కేసుల విచారణ యథావిధిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతుందని తెలిపారు. జ్యుడిషియల్ అకాడమీ తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు.
సెప్టెంబరు 7న క్లాట్
న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్)ను సెప్టెంబరు 7వ తేదీన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కారణంగా నాలుగుసార్లు పరీక్షను వాయిదా వేసిన దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్షియం ఆన్‌లైన్ పరీక్ష జరిగే తాజా తేదీని వెల్లడించింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈసారి సుమారు 77 వేల మంది దరఖాస్తు చేయగా, వీరిలో ఇంటర్ ఎంపీసీ గ్రూపు విద్యార్థులు ఉన్నారు. జేఈఈ మెయిన్ సెప్టెంబరు1 నుంచి 6వ తేదీ వరకు జరగనుంది.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'