గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నతస్థాయి దుకాణాలు కాకుండా చిన్నవే దాదాపు 7వేల దాకా చిన్న క్షౌరశాలలున్నాయి. వీటి ద్వారా దాదాపు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. కులవృత్తిపైనే ఆధారపడి దుకాణాలు నడిపిస్తున్నవారు పెద్దమొత్తంలోనే ఉండగా.. ఇతర రాష్ట్రాల కూలీలతో నడిపిస్తున్న వారూ ఉన్నారు. ఈ కూలీల్లో 40శాతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లే. వీరికి ఇక్కడి యజమానులు నెలకి రూ.8వేల దాకా చెల్లిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి పనులు ఆగిపోవడంతో వీరికి జీతాలు చెల్లించడంతోపాటు దుకాణాల అద్దె, నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ వీరిని వదులుకుందామంటే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందనే భయంతో కొందరు నిర్వాహకులు ఈ కష్టకాలంలో వారినీ పోషిస్తున్నారు. అన్ని దుకాణాలు అద్దె గదుల్లోనే నిర్వహిస్తుండటంతోపాటు కరెంటు బిల్లుల రూపంలో అదనపు భారం తప్పట్లేదని పలువురు వాపోతున్నారు.
ఇంట్లో అందరం ఖాళీనే..: గణేష్, క్షౌరశాల నిర్వాహకులు
మా ఇళ్లలో అందరం ఇదే వృత్తిని నమ్ముకున్నాం. కత్తెర ఆడితేనే కడుపు నిండేది. ప్రస్తుతం పనులన్నీ ఆగిపోవడంతో అంతా ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దుకాణం కూడా అద్దెగదిలో నిర్వహిస్తుందే. పూట గడవడానికీ కష్టం తప్పట్లేదు. పైగా అద్దె, కరెంటు బిల్లుల భారం.
ప్రభుత్వం ఆదుకోవాలి
ఇప్పటికే పక్కరాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు సాయపడుతున్నాయి. నగరంలో ఇప్పటికీ ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వారందరికీ భరోసానివ్వాలి. లాక్‌డౌన్ కాలంలో క్షౌరశాలల అద్దెలు తర్వాత చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ యజమానులకు మార్గదర్శకాలు జారీ చేయాలి. కరెంట్ బిల్లులు మాఫీ చేస్తే చిన్నదుకాణాలకు ఉపశమనం లభిస్తుంది. ఎంతోకొంత ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి.
- మోహన్, నాయీబ్రాహ్మణుల సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు