స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సర్వేలో నెలక్రితం నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం.. రెండు స్థానాలు ఎగబాకి రెండోస్థానానికి చేరింది. ఆఖరి రోజున అనూహ్య స్పందన లభిస్తే మొదటిస్థానం పక్కా అని జీహెచ్‌ఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. మూడు వారాల క్రితం వరకు అధికారులు సర్వే విషయాన్ని పట్టించుకోలేదు. ఈనెల 6న ‘తడబడి.. వెనకబడి’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో యంత్రాంగం మేల్కొంది.
రంగం సిద్ధం..
చైతన్య కార్యక్రమాలను ముమ్మరం చేసి సర్వేలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచింది. చివరి ప్రయత్నంగా నేడు పెద్దఎత్తున పౌరులు స్పందించేలా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎస్‌ఎస్ సర్వే మొత్తం 6 వేల మార్కులకు జరుగుతుంది. అందులో 30 శాతం(1800) మార్కులు జనాభిప్రాయానికి ఉంటాయి. ఎంతమంది స్వచ్ఛతపై స్పందించేందుకు ముందుకొచ్చారనేదే కొలమానం. 40 లక్షలకన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలతో పోటీపడి గతేడాది హైదరాబాద్ 1వ స్థానంలో నిలిచింది. అన్ని విభాగాల మార్కులను కలిపి ప్రకటించిన ర్యాంకుల్లో 23వ స్థానంలో నిలిచింది.
సర్వేలో ఎలా పాల్గొనాలి..
https://swachhsurvekshan2021.org/ వెబ్ పోర్టల్‌లోనూ నగరానికి జైకొట్టొచ్ఛు ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని గ్రేటర్ హైదరాబాద్‌ను ఎంచుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అందులో భాగంగా నగరంలో పారిశుద్ధ్యంపై స్వచ్ఛ భారత్ మిషన్ సంధించే పది ప్రశ్నలకు పౌరులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.