Rift between Telangana BJP leaders : తెలంగాణలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ.. దీనిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ.. అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మహిళా దినోత్సవం రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుపట్టారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కో-ఆర్డినేట్ చేయడానికేనని.. పవర్ సెంటర్ కాదంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Clash between Telangana BJP leaders : అర్వింద్ ఇంత తీవ్రంగా అసంతృప్తి వెళ్లగక్కడం వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. బండి సంజయ్, అర్వింద్ మధ్య గతంలో ఎలాంటి పొరపొచ్ఛాలు లేవు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో చేరికల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాల్కొండకు చెందిన ఒక నేత పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా.. అర్వింద్ అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి రావాలనుకునే ఇతర పార్టీల నేతలు బండి సంజయ్‌తో టచ్‌లో ఉండటం అర్వింద్‌కి నచ్చడం లేదని.. అందుకే అసంతృప్తి వెళ్లగక్కినట్లు చర్చ నడుస్తోంది.
వాళ్లు చేయాల్సిన పని అర్వింద్ చేశాడు..: పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్‌రావు సైతం బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని అసంతృప్తిని వెళ్లగక్కడం పరిస్థితికి మరింత ఆజ్యం పోసింది. అర్వింద్ వ్యాఖ్యలు వంద శాతం సమర్థనీయమని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు ఇతర సీనియర్లు చేయాల్సిన పనిని అర్వింద్ చేశారన్నారు. అధ్యక్షుడికి పరిణితి లేదని.. మసీదుల తవ్వకాలు, ముద్దు పెట్టడాలు, బ్లాక్‌మెయిల్ సమస్యలు లేవదీసి అంతర్గతంగా సెటిల్‌మెంట్లు చేస్తున్నారని బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయలోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం వంటి అంశాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేరాల శేఖర్‌రావు తన పోస్ట్‌లో పేర్కొనడం బీజేపీలో కలకలం రేపుతోంది.
అర్వింద్ అలా కామెంట్ చేయడం తప్పు..: మరోవైపు బండి సంజయ్‌కు మద్దతు పలుకుతున్న పలువురు నేతలు.. అర్వింద్ బహిరంగంగా విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీ నేత ఎవరైనా పార్టీ సమావేశాల్లో అధ్యక్షుడి వ్యాఖ్యలపై స్పందిస్తే.. అది అంతర్గత ప్రజాస్వామ్యమని విజయశాంతి అన్నారు. సంజయ్ తన మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. కేసీఆర్, వారి కుటుంబం, చాలా మంది బీఆర్‌ఎస్ నాయకులు అనేకసార్లు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సంజయ్‌పై అర్వింద్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడకూడదో సంజయ్‌కు తెలుసునని పేర్కొన్నారు. మీడియా ముందుకు వచ్చి అర్వింద్ కామెంట్లు చేయటం తప్పని రాజాసింగ్ తెలిపారు.
హస్తినకు సంజయ్, అర్వింద్ పంచాయితీ..: ఇప్పటికే బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య విభేదాలు అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను దిల్లీకి పిలిపించుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. పార్టీ పెద్దల ఆదేశంతో ఏకతాటిపైకి వచ్చి నేతలు ముందుకు సాగుతారా? లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎంపీ అర్వింద్, పేరాల శేఖర్‌రావు అసంతృప్తి వెళ్లగక్కడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. బండి సంజయ్, అర్వింద్ పంచాయితీ హస్తిన దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవీ చూడండి..
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు... బండి సంజయ్‌కు నోటీసులు
బండి సంజయ్‌పై అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్