మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహుదూర్‌పల్లికి చెందిన లక్ష్మి తన భర్తతో కలిసి కొద్దిరోజుల క్రితం మియాపూర్‌లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. బాచుపల్లి వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే అసువులు బాశారు. శిరస్త్రాణం (Helmets) ఉండటంతో భర్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతుండగా.. శిరస్త్రాణం (Helmets) లేకపోవడం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 21,999 ప్రమాదాలు జరగగా.. 6,964 మంది చనిపోయారు. వీరిలో 2,863 మంది ద్విచక్ర వాహనదారులే. మృతుల్లో 1,996 మంది డ్రైవర్లు, 867 మంది పిలియన్ రైడర్లు ఉన్నారు. వాహనం నడిపేవారితో పాటు పిలియన్ రైడర్ (వెనక కూర్చున్న వ్యక్తి) శిరస్త్రాణం (Helmets) ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. వాహనాలు విక్రయించే డీలర్లే రెండు శిరస్త్రాణాల (Helmets) ను ఉచితంగా ఇవ్వాలని నిబంధనలున్నాయి. వాటిని చాలామంది బేఖాతరు చేస్తుండటమే అసలు సమస్య.
ఇదీ నిబంధన
- కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని 138(4)(ఎఫ్) ప్రకారం.. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని (Helmets) ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనం తయారీ సమయంలో పాటించే వివిధ భద్రత ప్రమాణాల్లో శిరస్త్రాణాన్నీ (Helmets) పరిగణించాలి.
- ఉచిత శిరస్త్రాణాలు (Helmets) పొందడం తమ హక్కు అని.. చాలామంది వాహనదారులకు అవగాహన లేదు. కొందరు డీలర్లను అడిగితే తయారీదారులు సరఫరా చేయడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన ఒకరిద్దరు డీలర్లు తప్ప ఎక్కడా ఉచితంగా అందిస్తున్న దాఖలాలు లేవు.
ఇలా చేయాలి..
- రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీవో కార్యాలయాల్లో వాహనం ఇన్‌వాయిస్‌తోపాటు ఉచిత శిరస్త్రాణాలు (Helmets) పొందినట్లు చూపించే ధ్రువీకరణపత్రం జత చేయడాన్ని తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
- వాహన డీలర్లు రెండు శిరస్త్రాణాల్ని (Helmets) ఉచితంగా తమకు ఇచ్చినట్లు కొనుగోలుదారు ధ్రువీకరణ ఇవ్వకపోతే వాహనం రిజిస్ట్రేషన్ ఆపేయాలి. అలాంటి సందర్భాల్లో డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- షోరూంలలో ‘ఉచిత నిబంధన’ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలి.
- తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 9,06,705 వాహనాలు విక్రయించగా.. వాటిలో 6,45,954 (71.2 శాతం) ద్విచక్ర వాహనాలే.
- ద్విచక్ర వాహనదారుల ప్రమాద మరణాల్లో దేశంలో తెలంగాణ అయిదో స్థానంలో ఉంది.
- రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న జరిమానాల్లో 70 శాతానికిపైగా శిరస్త్రాణం (Helmets) ధరించని కేసులే ఉంటున్నాయి. 2019లో 72,74,713 (73.3 శాతం), 2020లో అక్టోబరు నాటికి 89,13,892 (78.13 శాతం) కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: Helmet: నాణ్యమైన శిరస్త్రాణం... నిలుపుతుంది ప్రాణం
constable suresh: రోజు సైకిల్‌పై 20 కి.మి. ప్రయాణం.. హెల్మెట్ లేకుండా వెళ్లడు