భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు రాజ్‌భవన్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లోని అతిథి గృహంలో బుధవారం పలువురు తెలుగు భాషావేత్తలతో ఆయన మాట్లాడారు. తెలుగు భాష వికాసానికి శాయశక్తులా కృషిచేస్తానని వారికి జస్టిస్ ఎన్వీరమణ హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరు హైకోర్టు జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నానని మండలి బుద్ధా ప్రసాద్ గుర్తుచేశారు. ఆ సమయంలో న్యాయవ్యవస్థలో తెలుగు భాష వాడుకకు సంబంధించి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజేఐకి గుర్తుచేశారు. జస్టిస్ రమణపై రాసిన ప్రశంసాపూర్వక పద్యాలను సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వినిపించారు. భగవద్గీతలోని శ్లోకాలను గంగాధరశాస్త్రి చెప్పారు. ఎమెస్కో ప్రచురించిన "తిరుపతి కథలు" పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమెస్కో అధినేత విజయకుమార్, ఆచార్య ఎన్.గోపి, గౌరిశంకర్, విజయభాస్కర్, సుద్దాల అశోక్‌తేజ, కె.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.
తెలుగువారందరికీ గర్వకారణం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అత్యున్నత పదవిని అధిష్ఠించడం తెలుగువారందరికీ గర్వకారణమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాజ్‌భవన్‌లో సీజేఐతో భేటీ అయి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి... సీజేఐని కలిసి మాట్లాడారు. సీఎస్ సోమేశ్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ ప్రభాకరరావు, ఎస్ఈసీ పార్థసారథి జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీజేఐని సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గుత్తా... నల్గొండ అంతటా పచ్చదనం కనిపిస్తోందని, వరి పండించడంలో పురోగతి ఎలా సాధ్యమైందని సీజేఐ అడిగినట్లు తెలిపారు. నాగార్జునసాగర్, ఎఎంఆర్, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందుతోందని... కొత్తగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీరందడంతో జిల్లా సస్యశ్యామలంగా మారుతోందని వివరించినట్లు వెల్లడించారు.
నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు
హైదరాబాద్‌లో తన రాకపోకల సందర్భంగా ట్రాఫిక్‌ను ఆపొద్దని... యథాతథంగా కొనసాగించాలని జస్టిస్ ఎన్వీ రమణ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనల మేరకు సిగ్నళ్ల వద్ద తాను ఆగడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను ఆపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని... అలాంటి వాటికి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు.