CJI Justice NV Ramana: పేదలు, సామాన్యులకు న్యాయం అందడమే లక్ష్యం కావాలని యువ న్యాయవిద్యార్థులకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయవిద్యార్థులకు న్యాయ పట్టాలు పంపిణీ చేశారు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాహిత్యం, చరిత్ర తెలిసి ఉండాలని విద్యార్థులకు సూచించారు. అంతిమంగా నిజం రాబట్టడానికి ప్రశ్నించే తత్వాన్ని మరవొద్దని సీజేఐ హితవు పలికారు. హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, బర్కత్‌పురాలో చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల నేడు అత్యున్నత స్థాయికి ఎదిగిందన్నారు. భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా ఉండాలని సూచించారు. న్యాయవిద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజాసమస్యలపై అవగాహన చేసుకోవాలన్నారు.
యువత ముందుకు రావాలి..
న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తమ శక్తిని వినియోగించుకునే మార్గమే యువత భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నారు. న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు స్నాతకోత్సవానికి హాజరయ్యారు.
నల్సార్‌తో ప్రత్యేక అనుబంధం
'నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. న్యాయవిద్యను అభ్యసిస్తూ మీరంతా ఎన్నో విలువైన ఉపన్యాసాలు విన్నారు. చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ ఉంటేనే న్యాయ విద్యకు సార్థకత చేకూర్చగలుగుతారు. చట్టం తెలుసుకుంటే సమాజంలో క్రమశిక్షణగా మెలగడమే కాదు ఆలోచనలో స్పష్టత, కచ్చితత్వం అంచనావేసేందుకు సహకరిస్తుంది. మాతృభాష గానీ మరే ఇతర భాషలలోనైనా సమాచార మార్పిడి సమర్థంగా ఉంటేనే న్యాయవాద వృత్తిలో రాణించగలుగుతారు. నిజాన్ని కనిపెట్టడం అంత కష్టం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలకు పరిష్కారం కనుగొనేలా న్యాయవిద్యలో కోర్సులను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'
-జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
ఇదీ చదవండి:
కోర్టుల ఆధునికీకరణతో ప్రజలకు సత్వర న్యాయం: జస్టిస్ ఎన్వీ రమణ