రాష్ట్రంలోని పౌరసరఫరాల శాఖలో అనేక సంస్కరణలు చేపట్టి.. పాలనతో అక్రమాలకు అరికట్టడంలో పారదర్శకత చూపి తనదైన ముద్ర వేసుకున్న కమిషనర్ అకున్ సబర్వాల్ కేంద్ర పోలీసు సర్వీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి, నల్గొండ జిల్లా పూర్వ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వినూత్న విధానాల అమలు:
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్... తీసుకొచ్చిన వినూత్న విధానాలు అమలు చేయడంతోపాటు తాను వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మరికొన్ని సంస్కరణలు అమల్లోకి తెచ్చానని అకున్ సబర్వాల్ చెప్పారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు మార్కెటింగ్ సీజన్లలో ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేశామని తెలిపారు.
కుటుంబ నేపథ్యమే ఇందుకు కారణం:
ఉద్యోగ రీత్యా పోలీసు శాఖైనప్పటికీ పంజాబ్‌లో తమ కుటుంబం, బంధువులు వ్యవసాయం చేస్తున్నారని... ఆ అనుభవం తనకు ఉన్నందు వల్ల రైతుల్లోకి చొచ్చుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించగలిగానని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది సహకారంతో మూడు మార్కెట్ సీజన్లు పనిచేయడం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నారు.
ఇదీ చూడండి: కేంద్ర రక్షణ మంత్రితో కేటీఆర్ భేటీ