రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానిది మధ్యవర్తిత్వం అంటున్న భాజపా నేతలపై పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. మిల్లర్లతో కుమ్ముక్కయ్యారంటూ చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ ఎఫ్‌సీఐ నుంచి ఖరీఫ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్లు రావాల్సి ఉందని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. తాజా యాసంగిలో రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లల్లో రికార్డు సృష్టించినట్లైందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో 6,301 కోనుగోలు కేంద్రాల ద్వారా 39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ఓ రికార్డు అని ప్రకటించారు. 6 లక్షలా 30 వేల మంది రైతుల నుంచి రూ.6,724 కోట్ల విలువైన ధాన్యం సేకరించడమే కాకుండా నగదు చెల్లింపుల కోసం సోమవారం రూ.615 కోట్లు, ఇవాళ రూ.286 కోట్లు విడుదల చేశామన్నారు.
"గతేడాది యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ఇదే సమయంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కరోనా కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో రైతులు ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే పెద్ద ఎత్తున ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వరకు 67.87 లక్షల మంది కార్డుదారులు రేషన్ తీసుకున్నారు. ఈ ఒక్క రోజే 2.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాం. జిల్లాల్లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లైతే జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ... ఆ సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నారు."
-మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..