కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా అదనపు కలెక్టర్లు మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వనపర్తి జిల్లాలో ధాన్యం రవాణాలో ఎదురవుతున్న సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణం స్పందించిన ఛైర్మన్ జిల్లాలో ధాన్యం రవాణా సమస్యలను వెంటనే పరిష్కరించి.. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేలా చర్యలు తీసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్కు సూచించారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మాట్లాడారు.
ఛైర్మన్ సూచన మేరకు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్.. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టారు. రవాణా కాంట్రాక్టర్లు ఒప్పందం ప్రకారం వాహనాలు సమకూర్చకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాలు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధర, తదితర ఫిర్యాదుల కోసం హైదరాబాదులోని పౌరసరఫరాల సంస్థ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు 1967/180042500333 సంప్రదించాలని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష