పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులు, చౌక ధరల దుకాణాల డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి టీకా ఇప్పించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఆయన కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు.
మే నెల నుంచి అదనపు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నందున ఇప్పటికే చాలా చోట్ల అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు కరోనా బారిన పడ్డారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అత్యవసర సేవల కింద పని చేసిన పౌరసరఫరాల సంస్థ ఉద్యోగులకు, రేషన్ డీలర్లకు మానవతా దృక్పథంతో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మాదిరిగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది కరోనా ఆరంభం, లాక్‌డౌన్ సమయంలో పౌరసరఫరాల ఉద్యోగులను అత్యవసర సేవలు కింద ప్రభుత్వం గుర్తించడంతో బాగా పనిచేశారని అన్నారు. అత్యవసర సేవలు ఉండటంతో ఎలాంటి మినహాయింపులు తీసుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరిపామని చెప్పారు.
అలాగే, రేషన్ లబ్ధిదారులకు రెండు నెలలపాటు 1500 రూపాయల నగదు, 5 నెలలపాటు చౌక ధరల దుకాణాల ద్వారా అదనపు బియ్యం పంపిణీ చేశామని వివరించారు. బియ్యం పంపిణీలో కూడా రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని... ఇప్పుడే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని తెలిపారు. రైస్ మిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలను నిలిపివేయలేదని ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో గన్నీ రికన్సిలేషన్, సీఎంఆర్ రికన్సిలేషన్ పూర్తి చేసుకున్న మిల్లర్ల వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించిన వెంటనే ఛార్జీలు చెల్లిస్తున్నామని చెప్పారు. గత వారంలో 7 కోట్ల రూపాయలు చెల్లించామని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం ఎలాంటి తరుగు లేకుండా దించుకొని ట్రాక్ షీట్‌లో తక్షణం నమోదు చేయాలని మిల్లర్లకు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్