జీహెచ్‌ఎంసీలో ఆర్టీసీ సిటీ బస్సులు ఎప్పుడెప్పుడు రోడ్డెక్కుతాయా అని... నగర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సిటీ బస్సులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరాశచెందుతున్నారు. గ్రేటర్ పరిధిలో గతంలో 3,800 ఆర్టీసీ బస్సులు తిరిగేవి. పాత బస్సులను కార్గోలకు బదలాయింపు చేసిన తర్వాత.. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు సుమారు 3వేలకు చేరుకున్నాయి. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే.. వైద్య, జీహెచ్ఎంసీ సిబ్బందికి, ఇతర అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం.. ప్రతి రోజూ 184 బస్సులను గ్రేటర్ పరిధిలో తిప్పుతున్నారు.
తెగిపోయిన కనెక్టివిటీ...
మెట్రో రైలు ప్రారంభమైన తర్వాత.. మెట్రో నుంచి దిగిన ప్రయాణికులు మెట్రో స్టేషన్ నుంచి తిరిగి కార్యాయాలకు చేరుకునేందుకు గతంలో ఆర్టీసీ బస్సుల కనెక్టివిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో.. ఆ కనెక్టివిటీ తెగిపోయింది. మెట్రో అధికారులు ఆర్టీసీ బస్సులను నడపమని కోరినప్పటికీ.. అందుకు ఆర్టీసీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఓ పక్క లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా నష్టపోగా.. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు నడకపోవడంతో.. ఆటోలు, క్యాబ్‌లకు అధిక ఛార్జీలు వెచ్చించి ప్రయాణం సాగించాల్సి వస్తుందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నడిపేందుకు సిద్ధం...
ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కడంతో.. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని నగర ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కూడా.. అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. బస్సులకు ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చడం.. రోజుకు గంట నుంచి రెండు గంటల వరకు బస్‌ను ఆన్ చేసి ఉంచడం... బ్యాటరీలు డిస్ ఛార్జ్ అయితే.. వాటిని మార్చడం... బస్సు వెలపల, లోపల సీట్లను శుభ్రం చేయడం వంటివి చేస్తున్నారు. బస్సులు ఎప్పుడు నడపమని ఉన్నతాధికారులు ఆదేశిస్తే.. అప్పుడు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు డిపోల్లో పనిచేసే సిబ్బంది అంటున్నారు.
విధులకు రావాలని ఆదేశాలు..
గ్రేటర్ పరిధిలో అన్ని డిపోల్లో ఉన్న కార్మికులను.. విధులకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు.. డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. గ్రేటర్‌లో కొవిడ్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో.. బహుశా మరికొన్నిరోజుల వరకు సిటీ బస్సులు తిప్పే అవకాశం ఉండకపోవచ్చని.. గ్రేటర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రయాణికులు మాత్రం... ప్రైవేటు వాహనాల ఛార్జీలు భరించలేకపోతున్నామని వాపోతున్నారు. నగరంలో నిత్యం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు... చిరుద్యోగులు తమకు వచ్చే ఆదాయం... ప్రయాణ ఖర్చులకే సరిపోతున్నాయని... ఇకనైనా ప్రభుత్వం సిటీ బస్సులను నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.