కేంద్ర ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను దూకుడుగా అమలు చేస్తోందని దీనితో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్తుందని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు కె.హేమలత ఆరోపించారు. హైదరాబాద్లో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సంక్షోభాన్ని సరి చేయకపోగా.. కొవిడ్-19 నేపథ్యంలోనూ కార్పొరేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టాల్లో రైతులు, కూలీలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ఉమ్మడి పోరు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో భాగంగా వచ్చే నెల 5వ తేదీన కార్మిక కర్షక పోరాట కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని.. గ్రామస్థాయి వరకు పాదయాత్ర నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన గళం వినిపించాలని ఆమె కోరారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విమర్శించారు. ప్రజారోగ్య వ్యవస్థను బలపరిచేందుకు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తేవాలని ఆయన పేర్కొన్నారు. వైరస్ నియంత్రణలో నిర్విరామ సేవలందిస్తూ అగ్రభాగాన నిలుస్తున్న వైద్యారోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనాను అడ్డం పెట్టుకొని కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రైవేటు యాజమాన్యాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూసీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష