Chinthan Shibir: ఉదయ్‌పూర్‌లో తీసుకున్న నిర్ణయాలను యథావిధిగా అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన "నవ సంకల్ప్ మేధోమథన శిబిర్'' నిర్ణయించింది. హైదరాబాద్ కీసర బాలవికాస కేంద్రంలో రెండ్రోజుల పాటు జరిగిన శిబిర్‌లో అనేక అంశాలపై నేతలు చర్చించారు. 6 అంశాలను ప్రధానంగా తీసుకుని... సీనియర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించారు. సభ్యుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ సంస్థాగత, రాజకీయం, వ్యవసాయం, యువత, సామాజిక న్యాయం, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలపై లోతైన చర్చ జరిగిందని శిబిర్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క వివరించారు. వ్యక్తిగత ప్రచారానికి తావు లేకుండా పార్టీ మూల సిద్దాంతాలను సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఉపాధి హామీ పనులకు 250 రోజులు..: పార్టీ బలోపేతం కోసం ఎన్నికల మేనిఫెస్టో మూడు నెలల ముందే ప్రకటించాలని.. ఆరు నెలల ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సూచించింది. ఉదయ్‌పూర్ నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పార్టీ సంస్థాగత కమిటీ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎన్నికల్లో అవకాశం రానివారికి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వివిధ పదవుల్లో అవకాశం ఇవ్వాలని సూచించింది. బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు అధిక కేటాయింపులు ఉండాలని.. ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచాలని నిర్ణయించారు.
యథాతథంగా జిల్లాల్లో..: పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని... విద్య, వైద్యం ఉచితంగా అందించాలని యువ కమిటీ సూచించింది. నవసంకల్ప్ మేధోమథన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను యథాతథంగా జిల్లాల్లో డీసీసీల నేతృత్వంలో చింతన్ శిబిర్‌లు ఏర్పాటు చేసుకుని చర్చిస్తాయని శిబిర్ కమిటీ కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకుండా రెండ్రోజుల పాటు కొనసాగిన "నవ సంకల్ప్ మేధోమథన్ శిబిర్'' ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా ముగియడంతో శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
ఇదీ చూడండి..
'మేధోమధన సదస్సు సక్సెస్.. 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన..'
'ఏ ఒక్కరి కోసమో న్యాయవ్యవస్థ పనిచేయదు.. పరిధులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు'