వసతి గృహాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అపర్ణ తెలిపారు. అమీర్ పేటలో సాలిడరిటీ సొసైటీ ఫర్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్న బాలికల అర్బన్ రెసిడెన్షియల్ వసతిగృహాంలో శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. సుమారు వంద మంది నిరుపేద బాలికలున్న వసతిగృహంలో సీసీ కెమెరాలు, టాయిలెట్ల నిర్వహణ తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నిధులతో వసతులు మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలనూ సందర్శించారు. విద్యాబోధన, మధ్యాహ్న భోజనం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు విజయ భాస్కర్, సుమలత, తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నాలుగు దశాబ్దాల పోరు..'లీపు' రోజున కొలిక్కి..!