మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం రోజు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి, పీవీ నరసింహారావు శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావు, ఇతర కుటుంబసభ్యులు పాల్గొంటారు. శాసనసభ కింది అంతస్తులోని సభ్యుల మందిరంలో ఏర్పాటు చేసిన పీవీ చిత్రపటాన్ని గురువారం సీఎం కేసీఆర్, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.
నేటితో అసెంబ్లీ సమావేశాల ముగింపు...
శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు శుక్రవారం రోజు ముగియనున్నాయి. శాసనసభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీసీల కులగణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని పక్షాల మద్దతు కోరనున్నారని తెలుస్తోంది. మండలిలో పల్లె, పట్టణ ప్రగతి అంశంతోపాటు స్టాంపుల చట్టం సవరణ బిల్లుపై చర్చించనున్నారు. శుక్రవారం నాటికి అన్ని బిల్లులకు ఆమోదం లభించనుండటంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చలు పూర్తవుతున్నందున సమావేశాలను ముగించనున్నారు. దీనిపై శాసనసభాపతి, మండలి ప్రొటెం ఛైర్మన్‌లు శాసనసభాపక్ష నేతలతో గురువారం రోజు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Huzurabad BY election: :ఈటల ఓటమే లక్ష్యంగా తెరాస.. రంగంలోకి ముగ్గురు మంత్రులు