CM KCR on TS Assembly Elections : తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా జరిగిన భారత రాష్ట్ర సమితి వార్షికోత్సవంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు. సభ ప్రారంభం, ముగింపులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బాగా పనిచేస్తే మంచిదని.. లేదంటే మీకే నష్టమని ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరులోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని.. ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమయం తక్కువగానే ఉన్నందున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఇంకా పడిపోయిందన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలు కీలకమని అంతా చురుగ్గా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు.
Telangana Assembly Elections 2023 : మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఏపీ తలసరి ఆదాయం రూ.2,19,518. ఇది మన కన్నా రూ.లక్ష తక్కువన్నారు. ఇంత కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలు 16, 17 ఉన్నాయన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడులను దాటేశామని.. తెలివి ఉంటే బండ మీద నూకలు పుట్టించుకోవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఆత్మీయ సభల నిర్వహణ బాగుందని.. నియోజకవర్గాల వారీగా సభలు విజయవంతంగా జరిగాయన్నారు.
తేడాలు రానివ్వద్దు.. కఠిన చర్యలుంటాయ్: అందుకు పార్టీ శ్రేణులకు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అభినందనలు తెలిపారు. ముఖ్యమైన పథకాల్లో పారదర్శకంగా కొనసాగాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాలు.. 58, 59 జీవోల ప్రకారం క్రమబద్ధీకరణ.. ఇవి సామాన్యులకు, పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలని తెలిపారు. అత్యంత క్రమశిక్షణతో అమలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి తేడాలు రానివ్వద్దని.. వస్తే కఠిన చర్యలుంటాయని కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ రైతులకు కేంద్రం మీద ఆశ లేదు: వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని.. ఎన్ని కష్టాలొచ్చినా ఆదుకుంటామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం మీద ఆశలు ఏనాడూ లేవన్నారు. ఎకరాకు రూ.10 వేలు పునరావాస సాయం ప్రకటించడం భారతదేశ వ్యవసాయ రంగంలోనే మొట్టమొదటిన సారి అని తెలిపారు. దళితబంధుకు ఇస్తున్న పెట్టుబడి వ్యక్తిగతంగా కాకుండా సమాజ సంపదను పెంచే సామాజిక పెట్టుబడిగా మారుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనినే ‘స్పిన్ ఆఫ్ ఎకానమీ’ అంటారని చెప్పారు. రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్ రూ.6 లక్షల కోట్లకు పెరుగుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతూనే ఉంటుందన్నారు. దళితబంధులో లబ్ధిదారుల నుంచి కొందరు అడ్వాన్సులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని కేసీఆర్ గుర్తు చేశారు. ఇలాంటి విషయాల్లో కఠినాతికఠినంగా వ్యవహరిస్తానన్నారు. తీరు మార్చుకోకుంటే టికెట్ ఇవ్వకపోవడమే కాదు.. పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడనన్నారు. పార్టీ పరంగా త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై ఎక్కడ లోపాలున్నాయో చెబుతానని.. మారకుంటే కఠిన నిర్ణయాలుంటాయన్నారు.
మే 4న దిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభం: పేదలకు పంచేందుకు గతంలో జాగాలు సమీకరిస్తే వాటిని వెంటనే పంపిణీ చేయాలన్నారు. హైదరాబాద్‌లో నోటరీ భూములను కూడా క్రమబద్ధీకరిద్దామన్నారు. కొత్త సచివాలయంలో ఇందుకు సంబంధించిన దస్త్రాలపై సంతకం చేస్తానని.. గృహలక్ష్మి పథకం విధివిధానాలు త్వరలో విడుదలవుతాయన్నారు. సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు.. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల్లోగా అక్కడికి చేరుకోవాలని సూచించారు. మే 4వ తేదీన దిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభం ఉంటుందని.. తర్వాత అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి: