క్రెడాయ్, ట్రెడాయ్ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ పనులకు కేంద్రం అనుమతించినందున సీఎస్ దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, పోలీస్ కమీషనర్లు పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఏర్పాట్లు చేసుకోవచ్చు...
కేంద్రం అనుమతుల నేపథ్యంలో పనులు కొనసాగించేలా అవసరమైన ఏర్పాట్లు ప్రాజెక్టు డెవలపర్లు చేసుకోవచ్చని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన పరిణామాల నేపథ్యంలో కార్మికులు, ప్రత్యేకించి వలస కూలీల్లో ప్రాజెక్టు డెవలపర్లు విశ్వాసం కలిగించాలని సీఎస్ సూచించారు. అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, వైద్యవసతి కల్పించాలని కోరారు. కార్మికులు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల ద్వారా నిర్మాణ రంగ మెటీరియల్ తీసుకెళ్లే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు.