జీహెచ్ఎంసీ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్ధరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ నెల ఏడో తేదీన వార్డుల వారీ ముసాయిదా జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో పేర్లు నిర్ధరించుకోవాలని... జాబితాలో పేరు లేనట్లైతే వెంటనే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు అవగాహన, ప్రచార కమిటీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమావేశమయ్యారు.
ceotelangana.nic.in, nsvp.in వెబ్సైట్లు లేదా ఈసేవా కేంద్రాల్లో పేర్లు తనిఖీ చేసుకోవాలని ఎస్ఈసీ సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఓటర్ల నమోదుకు గడువు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషర్ పార్థసారథి తెలిపారు. అసెంబ్లీ ఓటరు జాబితాలో ఉండి వార్డుల వారీ ముసాయిదా జాబితాలో లేకపోతే వెంటనే సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే 45శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం లేదని... విద్యాధికులు, ఉన్నత తరగతి ఓటర్లు నివసించే ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతోందని అన్నారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రతిఒక్కరూ పాల్గొనడం సామాజిక బాధ్యతన్న పార్థసారథి... సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలంటే ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని అభిప్రాయపడ్డారు.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల్లో పాల్గొనాలని... మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. అన్ని విషయాలపై అందరికీ అవగాహన కలిగించేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీకి స్పష్టం చేశారు.