నకిలీ సొసైటీ పేరుతో లావాదేవీలు చేస్తూ, పన్ను చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.22 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉందని అదనపు డీసీపీ జోగయ్య తెలిపారు.
ఎల్బీనగర్ హస్తనాపురానికి చెందిన రవి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరుతో లావాదేవీలు నిర్వహించాడు. ఐటీ చట్టం 35 ప్రకారం తన సొసైటీ పేరుతో లావాదేవీలు నిర్వహిస్తే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పలువురు వ్యాపారవేత్తలను నమ్మించాడు. వ్యాపారుల లావాదేవీలు సైతం సొసైటీ పేరు మీదనే నిర్వహించి వారి వద్ద నుంచి 5 శాతం కమీషన్ తీసుకునేవాడు.
అధిక మొత్తంలో లావాదేవీలు జరగడం, పన్ను చెల్లించకపోవడం వంటి కారణాలతో అనుమానమొచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.22 కోట్లు పన్ను బాకీ పడినట్లుగా గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారించిన పోలీసులు సుమారు 200 మంది వ్యాపారవేత్తల నుంచి రూ.22 కోట్లు కమీషన్ రూపంలో తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుడు రవిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: టిక్‌టాక్ కోసం ప్రాణం తీసుకున్నాడు