Additional Responsibilities of IAS Officers: విద్యాశాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిని నియమించడం సహా పలువురు ఐఏఎస్ అధికారుల అదనపు బాధ్యతల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణను విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయ మరో కార్యదర్శి శేషాద్రికి.. సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ను... చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. రవాణాశాఖ కమిషనర్‌గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఔషధ నియంత్రణ సంచాలకులు, ప్రజారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా... అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
డీఎస్పీల బదిలీలు: రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్న అంజయ్యను ఎల్బీనగర్ ఏసీపీగా బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో పీడీ సెల్‌లో ఏసీపీ ఉన్న మోహన్ కుమార్‌ను నాగర్‌కర్నూల్ డీఎస్పీగా బదిలీ చేశారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
అచ్చంపేట డీఎస్పీగా కృష్ణ కిషోర్ బదిలీ అయ్యారు. అనిశా డీఎస్పీగా ఉన్న మధుసూదన్ హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీగా, అక్కడ ఉన్న బాలస్వామిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. నిర్మల్ జిల్లా నేర విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న జీవన్ రెడ్డిని నిర్మల్ డీఎస్పీగా... అక్కడ పనిచేస్తున్న ఉపేందర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ డీఎస్పీగా నాగేంద్రచారి, కామారెడ్డి రూరల్ డీఎస్పీగా శ్రీనివాసులు బదిలీ అయ్యారు.