రేణిగుంట విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును... అనుమతి లేదంటూ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆపేశారు. దాదాపు 2 గంటలుగా ఆయన విమానాశ్రయంలోనే ఉన్నారు.
" కావాలంటే అరెస్టు చేసుకోండి. ఏంటీ దౌర్జన్యం.? ఎందుకు అడ్డుకుంటున్నారు..? ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్‌ను కలవడానికి. ఈ దేశంలో ఏం జరుగుతుంది. నేను ఏమైనా హత్య చేయడానికి వెళ్తున్నానా..? మీరు అనుమతి ఇవ్వకుంటే ఎస్పీ దగ్గరకు వెళ్తా..లేదంటే ఇక్కడే బైఠాయిస్తా..?"
- చంద్రబాబు
ఈ పర్యటనలో వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, కొవిడ్ వ్యాప్తి చెందుతుందని, ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందంటూ... రేణిగుంట పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన చంద్రబాబు.... ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యంతరమేంటని పోలీసులను ప్రశ్నించారు. అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో నేరుగా తెలుసుకుంటానంటూ.. చిత్తూరు జిల్లా కలెక్టర్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలను కలుస్తానని చెప్పారు. అయితే విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు కుదరదన్న పోలీసులు... వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు కూడా లేదా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఆ తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్యాధికారి ఫోన్లను పోలీసులు లాక్కున్నారు.
జగన్‌కు హితవు
రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇలాంటి నిరంకుశ, అణచివేత చర్యలతో తమను ఆపలేరని తేల్చి చెప్పారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం తమ గొంతు నొక్కలేదని, ప్రజల్ని కలవకుండా అడ్డుకోలేరని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు హితవు పలికారు.
ఇదీ చదవండి: 'మన ఓటే.. మన భవిష్యత్‌ను మార్చే ఆయుధం'