BABU TOUR: అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు.. ముంపు బాధితులందరినీ ఆదుకుని తీరుతామన్నారు. పోలవరం కాంటూర్ లెవల్ 41.15వరకు వారికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్ లెవల్ 45.75వరకు ఉన్న వారికి నష్ట పరిహారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులకు ప్రభుత్వం 2 వేలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులోని శివకాశీపురం బాధితుల ఇళ్లు, ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన బాబు... బాధితుల్ని పరామర్శించారు. అమరావతి రైతులు అందించిన నిత్యావసర సరుకులను చంద్రబాబు బాధితులకు పంపిణీ చేశారు. ప్రజలు తిరగపడతారనే భయంతోనే జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని చంద్రబాబు విమర్శించారు.
పోలవరం విలీన మండలాల్లోని.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుకు తెలంగాణ సరిహద్దులో.. పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముత్తగూడెం వద్ద తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆధ్వర్యంలో.. స్వాగతించారు. ఖమ్మం జిల్లా సత్తుల్లిలోనూ పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పోలవరం విలీన మండలాల పర్యటనకు బయలుదేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎక్కడికక్కడ ఘనస్వాగతం లభిస్తోంది. మైలవరం నియోజకవర్గంలో మాజీమంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా చంద్రబాబు వాహనశ్రేణి వెంట బయలుదేరారు.
ఇవీ చూడండి: