కరోనాను మించి ఏపీని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకర వైరస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పేరు మోసిన క్రిమినల్స్‌ను అడ్డంపెట్టుకుని వారితో తప్పుడు కేసులు వేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ నా ఇల్లు-నా సొంతం, నాస్థలం నాకివ్వాలి పేరిట ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలు, అన్ని నియోజకవర్గ ఇంఛార్జీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
"తప్పుడు వార్తలనే నిజాలుగా ప్రజలను నమ్మించటంలో జగన్ ఘనుడు. కుల, మతం విద్వేషాలు రగిలించడంలో ఆరితేరాడు. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి మంచివాళ్లపై బురదజల్లడం వైకాపా నేతల నిత్యకృత్యం. కేంద్రమంత్రి పేరుతో అక్రమ వసూళ్లు, బెదిరింపులు, హత్యాయత్నాలు, దందాలు చేసిన వారితో పిల్ వేయించి సామాజిక మాధ్యమాల్లో వాటిని వైరల్ చేశారు. మోసగించే వారితోనూ, పేకాట దందాలు నడిపేవారిని ఇందుకు వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీజేఐకు రాసిన లేఖ కోర్టు ధిక్కరణే అని స్పష్టం చేసిన న్యాయ నిపుణులపైనా వైకాపా బురద జల్లడం వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. చేసిన తప్పులను తెదేపాకు ఆపాదించి తప్పించుకోవాలనుకునే జగన్ మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. తన అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారు. డొల్ల కంపెనీలు, మనీ లాండరింగ్, అవినీతి కుంభకోణాల కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక శృంఖలాన్ని తయారుచేస్తుంది. భవిష్యత్తు కుంభకోణాలకు అదే పునాదిరాయిలా మారుతుంది. అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోకపోతే దేశాభివృద్ధికి అవరోధం అన్న ప్రధాని వ్యాఖ్య జగన్‌కు వందశాతం వర్తిస్తాయి"
-చంద్రబాబు
తెదేపాపై బురదజల్లే శ్రద్ధ పోలవరంపై లేదు..
ఆంధ్రప్రదేశ్ ప్రాణనాడి పోలవరంలో వైకాపా ప్రభుత్వం చేసిన అనేక తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండర్లు, అంచనాల పెంపులో చేసిన తప్పుడు ఆరోపణలే రాష్ట్రం మెడకు చుట్టుకున్నాయన్నారు. తెదేపాపై బురద జల్లడంలో చూపే శ్రద్ధ కేంద్రాన్ని ఒప్పించి పోలవరం పనుల వేగంగా పూర్తి చేయటంపై పెట్టడం లేదని విమర్శించారు. వైఎస్ హయాంలో రూ.400కోట్లు మాత్రమే ఖర్చు చేయగా.. తెదేపా 5ఏళ్లలో రూ.11వేల కోట్లు ఖర్చు చేసి 71శాతం పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. నీటిపారుదల రంగానికి రూ.64వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్, హంద్రీ-నీవా పనులు అన్ని ప్రాజెక్టుల పనులను వైకాపా ప్రభుత్వం నిలిపేసి రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని ధ్వజమెత్తారు.
పేదల సొంతింటి కల సాకారానికి 12లక్షల ఇళ్లు నిర్మిస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తుంటే ఏడాదిన్నరగా వాటిని ఇవ్వకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను రద్దు చేయటం తగదని హితవు పలికారు. సంక్రాంతికల్లా ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే వాళ్లే వాటిని సొంతం చేసుకుంటారని స్పష్టం చేశారు. ఎవ్వరి ఇళ్లలో వారు నివాసం ఉండేవరకూ తెదేపా బాధితుల తరఫున పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే వైకాపా పారిపోవటం ఖాయమన్నారు.
జగన్ చరిత్రలెన్నో..
అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు. గృహనిర్బంధాలతో ఆందోళనలను వైకాపా నేతలు అణగదొక్కాలని చూసి భంగపడ్డారని చెప్పారు. ఐకాస నాయకులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసుల్ని ఖండించారు. గాల్లో తిరిగి చేతులు దులుపుకుని వరదప్రాంతాల్లో అడుగుపెట్టని ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర సృష్టించారన్నారు. రేషన్ సరకులు అందాలంటే వారంరోజులు నీటిలో మునగాలనే నిబంధన తీసుకురావటం మరో చరిత్ర అని దుయ్యబట్టారు. బాధితుల్ని పరామర్శించిన తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్యని ఆక్షేపించారు.
నాయకులేమన్నారంటే...
ఇళ్లపట్టాలపై కోర్టు కేసులను తెదేపాకు ముడిపెట్టడం వైకాపా దివాలాకోరుతనం. కోర్టుకెళ్లింది వాళ్లేనని రుజువు చేస్తాం.
-అచ్చెన్నాయుడు, ఏపీ తెదేపా అధ్యక్షుడు
జగన్ నిర్వాకాలతో భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతోంది. తెదేపాపై తప్పుడు ఆరోపణలతో జగన్ రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారు. -అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
రైతులకు ఇచ్చే ధాన్యం చెల్లింపుల్లో కూడా మోసం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. నెల్లూరులోనే రూ.700కోట్ల కుంభకోణం జరిగింది. మిగిలిన జిల్లాలలో ఇంకెంత మోసం చేశారో ఉన్నత స్థాయి విచారణలోనే బయటపడాలి. పుట్టికి ఇంత చొప్పున వైకాపా ఎమ్మెల్యేలే రైతుల నుంచి వసూళ్లకు తెగబడి దోపిడీ చేశారు.
-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇదీ చదవండి: అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరం: కేటీఆర్