ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం, జవహర్, జ్యోతుల నవీన్‌పై తప్పుడు కేసులు.. కక్ష సాధింపులో భాగమేనని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డిని వేధించడాన్ని ఖండించారు. 8 ఏళ్ల క్రితం జరిగిన అంశంపై కడప హరిప్రసాద్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
తప్పు చేసినవాళ్లు ఎవరైనా పార్టీలకతీతంగా కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 3 నెలల్లో 3 జిల్లాల్లో ముగ్గురికి శిరోముండనాలు వైకాపా దమనకాండకు పరాకాష్ట అని విమర్శించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మనుషులకే కాకుండా దేవాలయాలకు, దేవుళ్ల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల పట్ల అపచారాలు, దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఆగకపోవడం.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా అడగకుండా.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు: చంద్రబాబు