ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం వ్యాఖ్యలను నిరసిస్తూ.. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు మాల మహానాడు ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించడానికి వెళ్లిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యను పోలీసులు అడ్డుకోగా. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెన్నయ్య డిమాండ్ చేశారు.
ఉపకులాలను వర్గీకరించే అధికారం రాష్ట్ర సర్కార్‌కు ఉందని కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తప్పుబట్టారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపకులాల వర్గీకరణ అధికారం ఇస్తే ... ఓటు బ్యాంకు కోసం వారు దుర్వినియోగం చేస్తారని చెన్నయ్య పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ , ఎస్టీలకు సమాన అవకాశాల కోసం రిజర్వేషన్లు తెస్తే... రాజకీయ నాయకులు స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను ఉపహరించుకోవాలని... లేనిపక్షంలో మాల కులాలను ఐక్యం చేసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెన్నయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 20న చలో దిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- ఇదీ చూడండి : మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్