రైతుల సమస్యలపై పోరాడటానికి ఈనెల 18న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, మాయమాటలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులకు చెందాల్సిన నిధులు ఇవ్వకుండా వారిని కేసీఆర్ సర్కార్ నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. రైతు బంధును సర్వరోగ నివారణిలా చూపిస్తూ.. మిగిలిన సౌకర్యాలను ప్రభుత్వం ఎగ్గొడుతోందని విమర్శించారు.
రెండేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన వాటా.. పంటల బీమా పథకానికి చెల్లించకపోవడం వల్ల రైతులు పరిహారం పొందలేకపోతున్నారని అన్వేశ్ రెడ్డి పేర్కొన్నారు. పంట బీమా పథకం ద్వారా అన్నదాతలకు రావాల్సిన నగదు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న కర్షకులను ఆదుకోవాల్సిన సర్కార్ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ కళ్లు తెరిపించడం కోసం రాష్ట్ర కిసాన్ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మేధావులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు పాల్గొనాలని కోరారు.