హైదరాబాద్ హిమాయత్ నగర్లో సీపీఐ ఆధ్వర్యంలో సిలిండర్ల శవయాత్ర, ఆటోలను తాళ్లతో కట్టి గుంజుతూ, బైకులను నెట్టుకుంటూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని, వంట గ్యాస్ ధరలు పెంచి దోపిడీ చేయడం ఆపాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహతోపాటు పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా నిరంతరంగా ఇంధన చార్జీలు పెంచడం వల్ల పేద ప్రజల నడ్డి విరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి వల్ల ఉపాధి లేక ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెరుగుదల ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు. కార్పొరేట్లకు అందించిన పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కలిగే నష్టాలను పూడ్చడానికి ఇంధన ధరలు పెంచి కేంద్రం మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆయన మండిపడ్డారు. ఇంధన ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా, ఉత్పత్తి ఖర్చులు, డీజిల్‌పై ఆధారపడే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకు ఇంధన ధరలు పెరుగుతూ ఉంటే సీఎం కేసీఆర్ స్పందించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు తగ్గించి... ఎక్సైజ్ సుంకాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోనళలు ఉద్ధృతం చేస్తామని చాడ వెంకట్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చూడండి : రథసప్తమి వేడుకల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి