CEO Vikasraj Comments on munugode bypoll 2022: మునుగోడు ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. సాయంత్రం 6గంటలతో ప్రచార సమయం ముగిసిందని, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రచారం నిలిపివేయాలన్నారు. బల్క్ మెసేజ్‌లు, ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడంపై నిషేధం విధించినట్టు చెప్పారు. మోడల్ కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
సత్వర స్పందన, స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ బృందాలు, పోలింగ్ స్టేషన్ల భద్రతను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ఓటర్లు కాకుండా అనధికార వ్యక్తులందరూ సాయంత్రం 6గంటల తర్వాత మునుగోడులో ఉండొద్దని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తుల సంఖ్యను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించినట్టు చెప్పారు.
ఈ బృందాలు ఇవాళ, రేపు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి అనధికార వ్యక్తుల ప్రక్షాళనతో పాటు నగదు పంపిణీ, ఇతర ప్రేరణలను పర్యవేక్షిస్తాయని వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారితో సమీక్ష నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలను సీఈవో పరిశీలించారు. ఉపఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. చండూరులోని డాన్‌బాస్కో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సిబ్బంది సన్నద్ధతను పర్యవేక్షించారు.
ఇవీ చూడండి..