కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. నగర పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బృందం పర్యటించింది. వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి పోలీసు అధికారులు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు తగిన భద్రత కల్పించామని... సాయిధ సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. వైద్యులపై జరిగిన దాడుల్లో రెండు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కేసులు..
లాక్డౌన్ ఉల్లంఘనలపై ఇప్పటివరకు 73 వేల మందిపై కేసులు నమోదు చేసి.. 97 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినవారు, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి ద్వారానే జరిగిందని పోలీసులు కేంద్ర బృందానికి వివరించారు. వైరస్ సోకిన కొందరి విషయంలోనే మూలాలను వెతుకుతున్నామన్నారు.
పాజిటివ్ కేసుల మూలకారణాన్ని వివరించిన పోలీసులు...
ఖైరతాబాద్‌లో కరోనాతో ఓ వృద్ధురాలు మరణించింది. స్థానికులు క్వారంటైన్‌కు తరలించి కొవిడ్ పరీక్షలు నిర్వహించి వృద్ధురాలి 38 మంది కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. కాని వృద్ధురాలికి వైరస్ ఎక్కడి నుంచి సోకిందనే విషయం ఇంకా అర్థం కాలేదు. కాలాపత్తర్ ప్రాంతంలో ఈ నెల 12న ఓ యాభై ఏళ్ల మహిళ చనిపోయింది. వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తతో పాటు 11 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వీటికి మూలకారణాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...