కేంద్ర జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించింది. పేట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సందర్శించి.. లాక్‌డౌన్‌తో వైద్య సేవలకు వస్తున్న పేషెంట్ల వివరాలు, అందిస్తున్న సేవలను, అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించి.. జోనల్ కమిషనర్ ప్రావిణ్య, డిప్యూటి కమిషనర్లతో లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ జోన్లలో తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించారు. సోమాజిగూడ ఎర్రమంజిల్‌లో నిర్మాణంలో ఉన్న భవన సమీపంలో ఏర్పాటు చేసిన వలస కార్మికుల వసతిని తనిఖీ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో కార్మికులకు నిర్మాణ సంస్థ కల్పించిన భోజన వసతుల గురించి తెలుసుకున్నారు.
ఎల్బీనగర్ జోన్‌లోని ఉప్పల్‌లో నెలకొల్పిన డీఎన్‌ఏ, ఫింగర్‌ప్రింట్ అండ్ డయోగ్నస్టిక్స్ కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఈ సంస్థలో ఉన్న వసతులు, నిర్వహిస్తున్న పరీక్షల తీరును సీడీఎఫ్‌డీ డైరెక్టర్ దేబశీష్ మిత్రతో చర్చించారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ