భారీవర్షాలు, వరదల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన అధికారులు... రెండు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, జిల్లాల్లో పర్యటించారు. హైదరాబాద్‌లో చెరువులు తెగిన, పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఒక బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది. స్థానికులతో పాటు అధికారులతో మాట్లాడారు. మరో బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించింది.
రెండు బృందాలుగా...
కేంద్ర అధికారులు శుక్రవారం కూడా పర్యటించనున్నారు. ఒక బృందం హైదరాబాద్‌లో వరద ప్రభావానికి ఎక్కువగా గురైన ఎల్బీనగర్, ఉప్పల్, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. మరో బృందం రంగారెడ్డితో పాటు మరికొన్ని ఇతర జిల్లాల్లో పర్యటించ వచ్చు. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమవుతుంది.
పరిస్థితిని వివరించిన అధికారులు
వర్షాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు ఇప్పటికే కేంద్ర బృందానికి వివరించారు. 8వేల 633 కోట్ల రూపాయల మేర పంటనష్టం, రహదారులకు 222 కోట్లు, జీహెచ్ఎంసీలో 567 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోమారు ఆయా శాఖల అధికారులతో కేంద్ర బృందం చర్చించనుంది. అవసరమైన అదనపు సమాచారాన్ని సేకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.
ఇదీ చూడండి: వరద వల్ల భారీ నష్టం... ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన