ఉమ్మడి ఏపీ విభజన అనంతరం... రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం పలు విద్యా, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ విశ్వవిద్యాలయాలకు సరిపడా నిధులు కేటాయిస్తుందని చెప్పారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణాన్ని కేంద్రమంత్రి పరిశీలించారు. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ ప్రయోగశాల-1లో భవనాల నమునాలను, ప్రయోగశాలలను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, బోధనా సిబ్బందితో సమావేశమయ్యారు. తిరుపతి ఐఐటీ అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతి ఐఐటీ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం రూ.540 కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ రంగ సంస్థలతో కలిసి తిరుపతి ఐఐటీ పలు పరిశోధనలు చేస్తుందన్నారు. ఏర్పాటైన 4 సంవత్సరాలలోనే తిరుపతి ఐఐటీ గణనీయమైన అభివృద్ధి సాధించటం సంతోషకరమన్నారు. దేశ అభివృద్ధిలో ఐఐటీలది కీలకపాత్ర అన్నారు. ఐఐటీల విద్యార్థులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు.
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీ ప్రకటించిందన్నారు. దేశంలో ఉపాధి రంగాలకు ఊతం అందించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో గానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ను దిగుమతిపై ఆధారపడే స్థితి నుంచి ఎగుమతులు చేసే దిశలో నడిపించడానికి కేంద్రం కృషిచేస్తుందన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్