తెరాస, ఎంఐఎం పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ఎంపీ ఓవైసీ ఒత్తిడి చేయడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశారన్నారు.
కేంద్రం అందిస్తున్న నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని పీయూష్ స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ 12 శాతం కల్పిస్తామని అబద్ధపు మాటలు చెబుతూ మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈబీసీ, ఆయుష్మాన్ భవ పథకాల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ దిల్లీకి వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని చెబుతూ, ఇక్కడ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఏదడిగినా తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు.