ప్రభుత్వ అధికారులు... ప్రగతిభవన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా ప్రజలకు సేవలు అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy Visits Slums) అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కోదండరెడ్డి నగర్ మురికి వాడను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ (OBC Morcha National President Laxman) కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్థానికులు పలు సమస్యలు మొరపెట్టుకున్నారు.
వర్షం వల్ల నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవడానికి కలెక్టర్కు తాత్కాలిక సాయం అందించే అధికారం ఉన్నా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు వారికి ఎలాంటి సహాయం అందించకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని మురికివాడల్లో వర్షానికి ఇళ్లు కోల్పోయిన బాధితులకు నేటి వరకు ఎలాంటి సహాయం అందకపోవడంపై మండిపడ్డారు. అభివృద్ధి అంటే మాదాపూర్, హైటెక్ సిటీ కాదని పేదలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఎన్నికలు వస్తేనే ప్రజలకు సేవలు అందిస్తామనే.. ప్రభుత్వ ఆలోచన మారాలని కిషన్రెడ్డి (Kishan Reddy Visits Slums) సూచించారు... మురికివాడల్లో జీవనం సాగిస్తున్న వారికి యుద్ధ ప్రాతిపదికన రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో వర్షాలకు ఇల్లు కోల్పోయిన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ కాని మున్సిపల్ కమిషనర్ కాని వెంటనే సహాయ సహకారాలు అందించే అధికారం ఉంటది. వెంటనే వీరికి సహాయం అందించాల్సిందిగా కోరాను. వరదల్లో నిత్యవసర వస్తువులు అన్ని పాడైపోయినవి. ఇంతకు వరకు వీరికి ఎలాంటి సాయం అందలేదు. బస్తీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
-- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ఇదీ చదవండి: Telangana Minister Harish Rao : 'రైతులపై కారెక్కించే భాజపాకు మీరు ఓటేస్తారా?'