Kishanreddy on Secunderabad Fire Accident: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ అగ్నిప్రమాదస్థలిని పరిశీలించారు. అగ్నిప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డెక్కన్ నిట్‌వేర్ ఘటనలో మంటల ధాటికి పక్కనే కాలనీలో దెబ్బతిన్న ఇళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయ శిబిరంలో ఉన్న స్థానిక ప్రజలతో మాట్లాడారు.
వారిని ప్రభుత్వం ఆదుకోవాలి : అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదన్న కేంద్ర మంత్రి... జనావాసాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న వేర్‌హౌజ్‌లు, గోడౌన్లపై సమగ్ర సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని నగరం వెలుపలికి తరలించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరూ చనిపోయినట్లు గుర్తించలేదని, మంటల ధాటికి కాలనీలో దెబ్బతిన్న జనావాసాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
సికింద్రాబాద్ డెక్కన్ నిట్‌వేర్ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనంలో దాదాపు 12 గంటల పాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతిన్నది. లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మంటలను ఆర్పేక్రమంలో ఏడీఎఫ్‌వో ధనుంజయరెడ్డి, ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వీరిద్దరినీ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ముగ్గురి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు : ఈ ఘటనలో ముగ్గురు గుజరాత్ కూలీలు జునైద్(25), జహీర్(22), వసీం(32) గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆచూకీ దొరక్కపోవడంతో వీరి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కూలీల సెల్‌ఫోన్లు సిగ్నళ్లు... కాలిపోయిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే... సెల్‌ఫోన్లు లోపలే వదిలేసి ఉండొచ్చన్న కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ వారు భవనం లోపలే చిక్కుకుని ఉంటే మృతదేహాలు కాలి బూడిదై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు క్రేన్ సాయంతో గాలిస్తున్నారు. గాలింపు చర్యలు పూర్తైన తర్వాత ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు.
టిఫిన్స్ పంపిణీ చేసిన కార్పొరేటర్ : సికింద్రాబాద్ నల్లగుట్ట అగ్నిప్రమాద ఘటనలో వ్యాపార సముదాయం చుట్టుపక్కల నివాసం ఉన్న ప్రజలకు స్థానిక బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో టిఫిన్స్ పంపిణీ చేశారు. నిన్న ఉదయం నుంచి నిద్రాహారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు అధికారులతో పాటు రాజకీయ నాయకులు ఆహారాన్ని మంచినీటిని అందించి వారి అహర్తిని తీరుస్తున్నారు. దాదాపు 100 నిరాశ్రయులకు ఆహారాన్ని అందించి నిన్నటి నుంచి వారికి కావాల్సిన కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఘటనలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని కార్పొరేటర్ తెలిపారు.
ఇవీ చదవండి: