Kishan Reddy Fires on TRS: ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ.. ఈ రోజు ఉద్యమ పోరాటాలను అణచివేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి సర్కార్ అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శించారు. గతంలో ఎప్పుడూ చూడని కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నామని పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. మాట్లాడారు.
మూఢ నమ్మకాల కోసం కొత్త సచివాలయం: ప్రజా సమస్యలపై బీజేపీ పాదయాత్ర చేస్తుంటే.. సిగ్గు లేకుండా తెరాస కార్యకర్తలు దాడులు చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సమాజమంతా బీజేపీ వైపు చూస్తుందని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేంత వరకు బీజేపీ కార్యకర్తలుగా తామందరం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీకి ఆయువుపట్టు హైదరాబాద్.. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజల సమస్యపై పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలో అడుగడుగునా రోడ్లు, కలుషిత నీరు, ఇండ్ల కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ఇలా ఎన్నో సమస్యలు భాగ్యనగరంలో దర్శనమిస్తున్నాయన్నారు. మూఢ నమ్మకాల కోసం రూ.వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారు: సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారన్న కిషన్‌రెడ్డి.. ఇప్పుడు దానిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం రూ.1,250 కోట్లు మెట్రోకి ఇచ్చినా.. అఫ్జల్‌గంజ్ వరకే మెట్రోను తీసుకెళ్తూ పాతబస్తీ ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓల్డ్ సీటీ ప్రజలకు మెట్రో రాకుండా టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు మెట్రో రైలు ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమాంతరంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు వేయండి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం సహకారం అందించినా, అందించకపోయిన పూర్తి చేస్తామని ఓ మంత్రి చెబుతున్నారన్న ఆయన.. ఇచ్చిన సహకారం మేరకు ముందుగా పాత లైన్ పూర్తి చేయండని పేర్కొన్నారు.
'తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యమాలను అణచివేస్తుంది. ఇలాంటి సర్కార్ అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. తెలంగాణ సమాజమంతా భాజపా వైపు చూస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. హైదరాబాద్‌లో సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి: