AP and TG Bifurcation Issues : తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కచ్చితమైన సమయాన్ని చెప్పలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘సమస్యల పరిష్కారానికి 2014 మే 12 ఒక కమిటీ ఏర్పాటైంది. ఇప్పటి వరకు అది 10 సార్లు సమావేశమైంది. విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికే అమలవుతున్నాయి.
వివాదాల పరిష్కారం అన్నది నిరంతర ప్రక్రియ. అందుకు కచ్చితమైన సమయం చెప్పలేం. ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కేవలం ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే సాధ్యమనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల పరస్పర సర్దుబాటు, అవగాహనతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కేంద్రం సహకారం మాత్రమే అందించగలదు’ అని పేర్కొన్నారు.