Central stops Rice: సెంట్రల్‌పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ విఫలమైందని పేర్కొంది. ఈ కారణంతో తప్పని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి సేకరించడాన్ని నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్రం ఆరోపించింది. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 40 మిల్లుల్లో 4 లక్షల 53 వేల 896 బియ్యం సంచులు మాయమైనట్లు కేంద్ర అధికారులు గుర్తించారని... డిఫాల్ట్ అయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు వివరించింది. తిరిగి మే 21న 63 మిల్లుల్లో లక్ష 37వేల 872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించినట్లు తెలిపారు. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేక పోయిందని...కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ ఆరోపించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని... ఇలాంటి కారణాల వల్ల సెంట్రల్‌పూల్ సేకరణ నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. వీటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను తక్షణమే ఎఫ్సీఐకి అందించాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: Student Suicide: ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు