సింగరేణికి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనులు కేటాయించడానికి సానుకూలంగా ఉన్నామని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ తెలిపారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్నతాధికారులతో అనిల్ కుమార్ జైన్ సమీక్ష నిర్వహించారు. దేశ బొగ్గు అవసరాలు తీర్చడంలో సింగరేణి కాలసీస్ కంపెనీ తన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని ఆయన అభినందించారు. బొగ్గుతో పాటు థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి కృషి ప్రశంసనీయమన్నారు. బొగ్గు రవాణా కోసం సొంతంగా రైల్వే లైను నిర్మించడంతో పాటు... పలు ఆధునిక పద్ధతులు అవలంభిస్తున్నారన్నారు. దక్షిణ భారత బొగ్గు అవసరాలు తీర్చడంలో సింగరేణి ముఖ్య పాత్ర పోషించాలని ఏకే జైన్ కోరారు.
సింగరేణి అభివృద్ధి, విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి వృద్ధిని సంస్థ సీఎండీ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఒడిశాలో కేటాయించిన నైనీ, న్యూపాత్రపాద బ్లాకుల్లో త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2025 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని.. మరిన్ని కొత్త గనులు కేటాయించాలని సింగరేణి సీఎండీ కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిని కోరారు. సమీక్షలో సింగరేణి డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కర్ రావు, బలరాం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం : సీఎం కేసీఆర్