తెరాస లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కృషి, పట్టుదల, చొరవతో ప్రతిపాదిత హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదం లభించింది. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎంపీ నామ పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖలు రాశారు. స్వయంగా కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి చర్చించి లేఖలు అందించారు. చివరికి హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ మంజూరు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నగరం చుట్టూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని నామ నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయమై నామ నాగేశ్వరరావు, ఎంపీలు మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులతో కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని దిల్లీలో కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ మౌళిక ప్రాజెక్టుల గురించి చర్చించారు.
రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని నామ అన్నారు. సీఎం కేసీఆర్... దూరదృష్టితో ఆలోచించి, రీజినల్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై సానుకూలం...
సెకండ్ ఫేజ్‌లో చౌటుప్పల్- షాద్‌నగర్ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలో మీటర్ల రహదారి ప్రాజెక్టును కూడా జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు నామ తెలిపారు. కోదాడ- ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపాదిత జాతీయ రహదారులు, ఇతర పెండింగ్ రహదారులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని నామ వివరించారు.
ఇదీచూడండి: 'రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1500 కోట్లు'