సమర్థమైన పోలీసింగ్, పౌరభద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రారంభించిన ప్రత్యేక పోలీస్ యాప్ స్టోర్ (టీఎస్‌కాప్)పై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. మొబైల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవడాన్ని మంచి ప్రయత్నంగా అభివర్ణించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ప్రచురించిన నివేదికలో రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ పోలీసు విధానాల్లో దీన్ని ఒకటిగా పేర్కొంది.
అధికారులు సమాచారాన్ని ఉపయోగించే విధానానికి ఇది కొత్త అర్థం చెబుతున్నట్లు పేర్కొంది. అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి ఈ యాప్ నేరుగా అధికారులకు అందిస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల సమగ్రమైన రీతిలో పోలీసు సేవలు అందించడానికి వీలవుతోందని పేర్కొంది.
నివేదిక పేర్కొన్న యాప్ విశిష్టతలు
* ఈ యాప్‌లో పోలీసులకు అప్పగించిన పాత్రను బట్టి యాప్‌లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 54 సేవలను గుర్తించి, వాటిని విభిన్నపాత్రలు పోషించే అధికారుల కోసం ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో అందుబాటులోకి తేవడం ముదావహం.
* జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీల గురించి రియల్‌టైమ్‌లో సమాచారం అందడం, తరచూ నేరాలకు పాల్పడేవారి కదలికలను జీపీఆర్ఎస్ ద్వారా ట్రాకింగ్ చేయడం, నేరనేపథ్యం ఉన్న ప్రాంతాలపై రియల్‌టైమ్ నిఘా పెట్టడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈసారి 18% నేరాలు తగ్గాయి.
* డయల్ 100ను హెచ్వైడీకాప్ యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల సమీపంలోని పోలీస్టేషన్లకు అత్యవసర హెచ్చరికలు వేగంగా పంపడానికి వీలవుతోంది. ఈయాప్ లేని సమయంలో అత్యవసర స్పందనకు 30 నిమిషాలు పడితే, ఇప్పుడు 5 నిమిషాల్లోపే సరిపోతోంది.
* ఈ యాప్ ద్వారా పోలీసు అధికారులు జియోట్యాగ్ చేసిన 8వేల పాయింట్లను పర్యవేక్షించడానికి వీలవుతోంది. పెట్రోలింగ్ కార్లు ఎలా తిరుగుతున్నాయి? బీట్కానిస్టేబుళ్లు ఏం చేస్తున్నారు? అన్నది నిరంతరం పర్యవేక్షిస్తున్నందున పోలీసుల కదలికలు పెరిగాయి. ఇది నేర నివారణకు దోహదపడుతోంది.
* హెచ్‌వైడీ కాప్ యాప్ లేని సమయంలో నేరగాళ్ల ఆనవాళ్లు కనిపెట్టడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఆధార్, వాహన రిజిస్ట్రేషన్ అడ్రస్, డ్రైవింగ్ లైసెన్సు, మొబైల్, పాన్ నెంబర్, ఓటర్ఐడీల ద్వారా అనుమానితుల చరిత్రను సేకరించి నిఘా పెట్టగలుగుతున్నారు.
* క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)తో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను అనుసంధానం చేసే ప్రక్రియను మొదలుపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే.
ఏపీ పోలీస్ ‘ఆటోమేటెడ్ వెహికిల్ అలర్ట్ సిస్టంకు కేంద్రం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమలుచేస్తున్న ఆటోమేటెడ్ వెహికిల్ అలర్ట్ సిస్టంకు కూడా కేంద్ర హోంశాఖ గుర్తింపు లభించింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసే సమయంలోనే చోరీకి గురైన, స్వాధీనం చేసుకున్న వాహనాలతోపాటు, నేరాలకు పాల్పడే సమయంలో ఉపయోగించిన వాహనాల వివరాలన్నీ పోలీస్‌స్టేషన్ రికార్డులతోపాటు, ఈకాప్స్ యాప్‌లో నమోదుచేసి కేంద్రీకృతంగా నిల్వచేయడం వల్ల చోరీ అయిన వాహనాలను కనిపెట్టడం సులభమవుతున్నట్లు నివేదికలో పేర్కొంది.
ఇదీ చూడండి: సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాదాద్రి సన్నిధి