ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్ కేసుల నమోదు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష జరిపారు. అనంతరం ఆళ్ల నాని డెల్టా వేరియంట్ గురించి మాట్లాడారు. బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకలేదన్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత తిరుపతిలో కలకలం రేగింది.
బాధితుడు ఉన్న వీధి, పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 3న తిరుపతిలోని ఓ 50 ఏళ్ల వ్యక్తి వైరస్ నిర్ధారణ పరీక్ష కోసం నమూనా ఇచ్చారు. 4వ తేదీన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తర్వాతి రోజు ఆయన స్విమ్స్ కొవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 13న డిశ్ఛార్జి అయ్యారు. కుటుంబసభ్యుల్లోనూ పలువురికి వైరస్ సోకింది. అందరూ కోలుకున్నారు. డెల్టా ఫ్లస్ వేరియంట్ గుర్తించినట్లు సమాచారం అందగానే ఆరోగ్యసిబ్బంది బాధితుడి నివాసం, పరిసరాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. స్థానికుల నుంచి అనుమానిత లక్షణాల వివరాలు సేకరించారు.
ఎలా తెలిసిందంటే...
రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ(CCMB)కి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ వేరియంట్ గుర్తిస్తున్నారు. ఈ నమూనాలను అక్కడే ఉంచి... కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వాటిని మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ నమూనాను తొలుత పరీక్షించినప్పుడు అనుమానం రాలేదు. తాజాగా కలకలం రేపుతున్న డెల్టా ఫ్లస్ గురించి తెలుసుకొనేందుకు మళ్లీ పాత నమూనాలను పరీక్షిస్తుండగా.. ఈ నమూనాలో ఆ వేరియంట్ బయటపడిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని తెలిపారు. నమూనా సేకరించిన రెండున్నర నెలల దాటిన తర్వాత తెలిసిన ఈ కేసుకు సంబంధించిన ఎవరికీ అనారోగ్య లక్షణాలు లేవని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బాధిత వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారిలో 15 మంది నుంచి నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. సమీపంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ డెల్టా ప్లస్ కేసుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. మూడో వేవ్ అనివార్యమైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
డెల్టా ప్లస్‌తో సంక్రమణ వేగం అధికం
ఆంధ్రప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగుచూడటంతో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల నమూనాలను తగిన సంఖ్యలో ఇన్సాకాగ్ ప్రయోగశాలలకు పంపాలని సూచిస్తూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్ శుక్రవారం ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖ రాశారు. ‘ప్రస్తుత కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వైరస్ జన్యు పరిణామక్రమాన్ని విశ్లేషించడానికి ఇన్సాకాగ్ ప్రయోగశాలల సముదాయాన్ని ఏర్పాటుచేసింది. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రజారోగ్య సంరక్షణ హెచ్చరికలు జారీచేయడానికి వీలవుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్ ద్వారా సంక్రమణ వేగం పెరుగుతుందని, ఊపిరితిత్తుల కణాల్లో అది బలంగా అతుక్కుపోతుందని, మోనోక్లోనల్ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్ తిరుపతిలో బయటపడినట్లు సమాచారం అందించింది. అందువల్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాలో తక్షణం కఠినమైన కట్టడి చర్యలు చేపట్టండి. జనాలు గుమిగూడకుండా, సమావేశాలు కాకుండా నిలువరించండి. విస్తృతస్థాయిలో పరీక్షలు నిర్వహించి కచ్చితంగా రోగులను కనిపెట్టండి. ప్రాధాన్యక్రమంలో వ్యాక్సినేషన్ కొనసాగించండి’ అని ఈ లేఖలో సూచించారు.
ఇదీ చదవండి: Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్ దాటిన కరోనా టీకా పంపిణీ