ETV Bharat / state

బ్రిటన్‌ వేరియంట్‌ ప్రభావం తగ్గుతోంది: రాకేశ్‌ మిశ్రా - CCMB former director Rakesh Mishra latest news

దేశ ప్రజలను అధిక ఆందోళనకు గురిచేసిన కరోనా యూకే వేరియంట్‌(బి.1.1.7) నెలన్నర రోజులుగా తగ్గుతున్నట్లు మే మొదటి వారంలో ఇచ్చిన నివేదికలో ఇన్సాకాగ్‌ పేర్కొందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. అయితే... టీకా ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ వైరస్‌లో కొత్త ఉత్పరివర్తనాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అందరికీ టీకాలు వేయడమే కాదు... సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు.

బ్రిటన్‌ వేరియంట్‌ ప్రభావం తగ్గుతోంది: రాకేశ్‌ మిశ్రా
బ్రిటన్‌ వేరియంట్‌ ప్రభావం తగ్గుతోంది: రాకేశ్‌ మిశ్రా
author img

By

Published : May 20, 2021, 8:19 AM IST

బ్రిటన్‌ వేరియంట్‌ ప్రభావం తగ్గుతోంది

‘‘దేశవ్యాప్తంగా చేసిన పరిశోధనల్లో కరోనా బి.1.617, బి.1.1.7, బి.1.351, పి.1 ఉత్తరివర్తనాలతోపాటూ మరిన్ని రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నట్లు గుర్తించారని రాకేశ్​ మిశ్రా పేర్కొన్నారు. ప్రమాదకరమైన యూకే వేరియంట్‌(బి.1.1.7) నెలన్నర రోజులుగా తగ్గుతున్నట్లు ఇన్సాకాగ్‌ పేర్కొందని తెలిపారు. మహారాష్ట్రలో అధికంగా కనిపించిన బి.1.617 ఇతర రాష్ట్రాలకు విస్తరించిందన్నారు. మున్ముందూ వైరస్‌లో జన్యుపరమైన మార్పులు మరిన్ని వచ్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఒక డోసు టీకాతో వైరస్‌కు సవాల్‌..
ఇప్పటివరకు దేశంలో కనుగొన్న వైరస్‌ ఉత్పరివర్తనాలన్నింటిపై ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు పనిచేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కానీ టీకాలు రెండు డోసులు తీసుకుంటేనే పూర్తి రక్షణ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఒక డోసు వేసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఒక డోసు తీసుకున్నవారిలోనూ 60-70% వరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొవిషీల్డ్‌ రెండో డోసు వ్యవధి 12-16 వారాలైనా ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఒక డోసు వేసుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకరకంగా వీరు వైరస్‌కు సవాల్‌ విసురుతున్నారు. శరీరంలోకి ప్రవేశించేందుకు అది కొత్తదారులు వెతుకుతుంది.
27 ప్రయోగశాలల్లో ఉత్పరివర్తనాలపై విశ్లేషణ
వైరస్‌లో ఉత్పరివర్తనాలపై దేశవ్యాప్తంగా 27 ప్రయోగశాలలు జీనోమ్‌ సీక్వెన్స్‌ కన్సార్షియం (ఇన్సాకాగ్‌)గా ఏర్పడి అధ్యయనం చేస్తున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల నమూనాల్లోంచి 5% జినోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్‌లోని సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ పరిశోధన సంస్థలు వైరస్‌ జన్యుక్రమాలను విశ్లేషిస్తున్నాయి. వీటి పరిధిలోని రాష్ట్రాల నుంచి తగినంత స్థాయిలో నమూనాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం సీసీఎంబీలో వారానికి 500 వరకు, సీడీఎఫ్‌డీలో 350 వరకు వైరస్‌ జన్యుక్రమాలను కనుగొంటున్నారు. ఎక్కువ సంఖ్యలో వైరస్‌ నమూనాలను పరిశీలిస్తేనే ఏరకం వైరస్‌ ఎక్కువ వ్యాప్తిలో ఉంది? కొత్తగా ఏదైనా వేగంగా వ్యాపిస్తుందా? వంటి వివరాలు తెలుస్తాయి’’ అని మిశ్రా వివరించారు.

ఇదీ చూడండి: జంతువుల్లో కరోనా పరీక్షలకు ప్రత్యేక పద్ధతులు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.