గాలిలో కరోనా వైరస్ ఉంటుందని విదేశీ శాస్త్రవేత్తలు గతంలోనే నిర్ధారించారు. అందుకు అనుగుణంగా భారత్‌లో పరిస్థితులపై సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ, చండీగఢ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ(ఐఎంటెక్) శాస్త్రవేత్తలు సెప్టెంబరు-నవంబరు నెలల్లో పరిశోధన చేపట్టారు. హైదరాబాద్‌లోని మూడు ఆసుపత్రులు, మొహాలీలోని మూడు ఆసుపత్రుల నుంచి గాలి నమూనాలను సేకరించారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను వినియోగించారు. కొవిడ్, కొవిడేతర ఐసీయూలు; కరోనా, సాధారణ వార్డులు, కారిడార్‌లు, ఓపీ కారిడార్లు, మార్చురీలు, కొవిడ్ క్యాజువాలిటీ ప్రాంతాలు, వైద్యుల గదులు ఇలా అన్నిచోట్ల నుంచి 64 నమూనాలు సేకరించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 41 నమూనాలను సేకరించి ఆర్‌టీ-పీసీఆర్‌పై పరీక్షించి అనేక అంశాలపై స్పష్టతకు వచ్చారు.
ముందుకొస్తే యంత్రాలు ఏర్పాటు చేస్తాం..
'ప్రస్తుత పరిస్థితుల్లో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రజారవాణా, మాల్స్, పాఠశాలలు, పరిశ్రమలు, గృహ సముదాయాల్లో గాలిలో వైరస్ ఏ మేరకు ఉంటుందనేది తెలుసుకోవడం అత్యంత అవశ్యం. వచ్చే ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. కొవిడ్ ఉన్న వ్యక్తి ఇలాంటి చోట్ల సంచరించినప్పుడు గాలిలో వైరస్ ఎంత సేపు ఉంటుంది? ఎంత దూరం వైరస్ కణాలు ప్రయాణిస్తాయి? ఎంతమందికి వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది? వంటి విషయాలు తెలుసుకోగలం. ఇందుకోసం కొన్నిరోజుల పాటు నిత్యం వైరస్ లోడును తెలుసుకునేందుకు వీలుగా సేకరించిన నమూనాలను ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చాల్సి ఉంటుంది. ముందుగా ప్రభుత్వ భవనాల్లో నమూనాల సేకరణకు అనుమతిస్తే మిగతావారు ముందుకొస్తారు. ఏదైనా కంపెనీ ముందుకొస్తే వారికే శిక్షణ ఇచ్చి సేకరించే బాధ్యతను అప్పగిస్తాం. కొవిడ్ రెండోవేవ్ నేపథ్యంలో సీసీఎంబీ ప్రయోగశాలలోనూ పరీక్షలను రెట్టింపు చేశాం. వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సంఖ్యనూ పెంచాం.'
- డాక్టర్ రాకేశ్ మిశ్ర
రెండు మీటర్ల దూరం వరకూ వ్యాపిస్తున్నాయ్..
- కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల నుంచి రెండు మీటర్ల దూరం వరకు వైరస్ తాలూకూ సూక్ష్మ కణాలు వ్యాపిస్తున్నాయి.
- రెండు గంటల కంటే ఎక్కువసేపు గాలిలో ఉంటున్నాయి.
- వైరస్ లోడు ఆధారంగా గాలిలో వ్యాప్తి ఉంటోంది.
- ఒక గదిలో ఉన్న కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల సంఖ్య, వారి రోగ లక్షణాలు, ఎంతసేపు అక్కడ గడుపుతున్నారనే దానిపై వ్యాప్తి ఆధారపడి ఉంది.
- ఎలాంటి లక్షణాలు లేని కొవిడ్ పాజిటివ్ వ్యక్తి గదిలో ఫ్యాను, ఏసీ లేనప్పుడు వారి నుంచి వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందలేదు.
- కొవిడ్ వార్డులు మినహా సాధారణ వార్డుల్లో వైరస్ ఆనవాళ్లు కన్పించలేదు.
ఇదీ చూడండి: టిమ్స్‌లో వైద్య సేవలపై వీడియో... ట్వీట్ చేసిన మంత్రి ఈటల