యూకే నుంచి వచ్చిన కొందరు ప్రయాణికుల నమూనాల్లో ఉన్నది కొత్త వైరస్సేనని పరిశోధన సంస్థలు ధ్రువీకరించాయి.. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రయోగశాలలతో పాటు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో కొత్తరకం కొవిడ్ వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించినప్పుడు దాని గురించిన మరిన్ని విషయాలూ వెలుగుచూశాయి. ఇది పాత వైరస్ కంటే వేగంగానూ వ్యాప్తి చెందుతుందని తేలింది.
‘యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయిన 40 మంది నమూనాలను సీసీఎంబీలో పరీక్షించాం. వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు కొంతమందిలో తప్పుగా పాజిటివ్(ఫాల్స్ పాజిటివ్) వచ్చినట్లు నిర్ధారించారు. 20 నమూనాల తాలూకూ జన్యుక్రమాన్ని కనుగొనగా, ముగ్గురిలో కొత్త వైరస్ బి.1.1.7. ఉన్నట్లు గుర్తించాం’ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్ర వెల్లడించారు. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో వైరస్ జన్యుక్రమం కనుగొనడం అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో రెండు పద్ధతుల్లో సీసీఎంబీ ఈ పరిశోధన సాగించిందని దీనికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ దివ్వతేజ్ సొంపాటి తెలిపారు. ‘సంప్రదాయ పద్ధతితోపాటు ఆధునిక నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ సాధనంపై కొత్త వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించాం. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కొత్త రకం వైరస్ జన్యువులో 17 ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్స్) ఉన్నట్లు గుర్తించాం. వీటిలో ఎనిమిదింటి ప్రభావం వైరస్ కొమ్ము భాగంపై(స్పైక్ ప్రొటీన్లు) ఉంది. మానవ కణాల్లో వైరస్‌ను బంధించి ఉంచడానికి అది దోహదం చేస్తోందని, శరీరంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని మరొక ఉత్పరివర్తనం పెంచుతోందని తెలుసుకున్నాం’ అని దివ్వతేజ్ తెలిపారు.
లక్షణాలు పాతవే.. భయం వద్దు
దేశంలో బయటపడిన వైరస్ రకం కొత్తదే అయినా తీవ్రత, లక్షణాలన్నీ పాతవేనని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్ర అన్నారు. టీకా అభివృద్ధికి ఇవేమీ అడ్డంకి కాదన్నారు. పాత వాటి కంటే కొత్త వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున నివారణకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరన్నారు.
ఆర్టీపీసీఆర్ ఉంటేనే.. విమానాశ్రయం నుంచి బయటకు
దేశంలో కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే వారు, తమ ప్రయాణానికి 96 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదిక సమర్పించడాన్ని తప్పనిసరి చేశారు. లేకుంటే నగరంలోకి అనుమతించకూడదనే నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులూ ఆర్టీపీసీఆర్ నివేదిక చూపాల్సిందేనని నిబంధన విధించారు. ప్రస్తుతం విమానాశ్రయానికి నిత్యం 7 లేదా 8 అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులు ఇప్పటికే నిలిచిపోగా, షార్జా, అబుదాబి, దోహా, ఖతార్ తదితర విమానాశ్రయాల నుంచి నిత్యం 900-1000 మంది ప్రయాణికులు వస్తున్నారు. వీరిలో 100-120 మంది ఆర్టీపీసీఆర్ నివేదిక లేకుండా వస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.
- ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో ఓ మహిళకు యూకే వైరస్