CBI Officials Notices to Kadapa MP Avinash Reddy: ఏపీలోని కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. పులివెందులలో అవినాష్ రెడ్డి పీఏకు సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందిస్తూ.. వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ ద్వారా సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు.
మంగళవారం పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో కోరారు. ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని అవినాష్‌రెడ్డి తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ కడప నుంచి పులివెందులకు వెళ్లిన విషయం తెలిసిందే. పులివెందుల వైకాపా కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: