మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు. సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి కడప జిల్లాలో వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి సుధాసింగ్ను మార్చారు. ఇప్పటికే కేసులో పలువురు కీలక అనుమానితులను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి విచారించారు. ఈ దర్యాప్తు విచారణకు డీఐజీ సుధాసింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
మూడు రోజుల కిందట ఆమెను దర్యాప్తు బాధ్యతల నుంచి మార్చి మరో అధికారిని నియమించినట్లు సమాచారం. సీబీఐ డీఐజీ సుధాసింగ్ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వివేకా కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఉన్నతస్థాయి అధికారిని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసులో (viveka murder case) సీబీఐ దూకుడు పెంచింది. కేసులో ఇప్పటికే 30 మందికి పైగానే కీలక అనుమానితులను సీబీఐ అధికారులు నాలుగోదఫా విచారించారు. ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి సోదరులు, వాచ్ మెన్ రంగన్న, పనిమనుషులను విచారించారు. ఇవాళ 47వ రోజు వాచ్‌మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. కొత్త ఎస్పీ స్థాయి సీబీఐ అధికారి ఇంకా కడపకు రాలేదని సమాచారం.
హత్య కేసులో కీలక ఆధారాలను సేకరించింది. కడప జిల్లా జమ్మలమడుగులోని మెజిస్ట్రేట్ ముందు వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చాడు. సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్.. వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 47 రోజులుగా కడపలోనే మకాం వేసిన దర్యాప్తు సంస్థ అధికారులు.. అనుమానితులను ప్రతి రోజూ ప్రశ్నిస్తున్నారు. అవసరాన్ని బట్టి పులివెందులకు సైతం వెళ్లి విచారణ చేస్తున్నారు. ఈ పరిణామం వివేకా హత్య కేసు విచారణలో కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Viveka Murder Case: 39వ రోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ