MP Avinash Reddy CBI Investigation Over: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ నేతృత్వంలోని బృందం విచారించింది. ఈ కేసులో ఇప్పటికే 248 మంది వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఈ వాంగ్మూలాల ఆధారంగా.. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని సీబీఐ బృందం అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు.
‘సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్‌పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యా. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐని కోరా. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నా సమాధానాలతో నివృత్తి చేశా. మళ్లీ ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని చెప్పా. ప్రజలకు కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలని వీడియో, ఆడియో అనుమతి కోరా. అందుకు అధికారులు అంగీకరించలేదు. నాలుగున్నర గంటల పాటు సీబీఐ అధికారులు నన్ను విచారించారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేను. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయి.'-అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ
ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాదిని సీబీఐ అధికారులు గదిలోకి అనుమతించలేదు. సీబీఐ కార్యాలయానికి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులతో పాటు అవినాశ్ అనుచరులు భారీగా చేరుకున్నారు. సీబీఐ విచారణకు హాజరకావడానికి ముందు... ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మతో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మను కలిశారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి దాదాపు మూడేళ్లుగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019 మార్చిలో వివేకా హత్య జరిగినప్పటి నుంచి దాదాపు ఏడాది తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఇప్పటికే 248 మందిని ప్రశ్నించి వారి నుంచి వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. ఇంతమందిని ప్రశ్నించినప్పటికీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా అతనిపై వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే అవినాష్‌రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావించారు.
ఇవీ చదవండి: